కొండొండోరి సెరువుల కాడా (Kondondori Cheruvulu Kada) // తెలుగు జానపదాలు (Telugu Janapadalu)-Telugu folksongs
- Get link
- X
- Other Apps
ఈ పాట 1983 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడెమీ ప్రచురించిన జానపద గేయాలలో చివరిది. సంపాదకురాలు కళాప్రపూర్ణ శ్రీమతి ఎం. అనసూయాదేవి.
ఇక దీని భావం విషయానికి వద్దాం. స్పష్టమైన టీక లేనప్పుడు చేస్తున్న స్థితగతిచింతనం ఇది. ఇది ప్రధానంగా ప్రతీకాత్మకంగా చమత్కారపు బాటలో నడిచిన పాట. 11 చరణాల ఈ పాటలో మొదటి రెండు పంక్తులు ముగ్గురిని గురించి చెబుతుంటే , మిగిలిన రెండు పంక్తులు రెండింటిని గూర్చి చెబుతుంటాయి. విచిత్రమేమిటంటే ఆఖరుగా ఉన్న రెండు పంక్తులు మొదటి మూడింటి ఫలితాలగురించి వివరిస్తుంటాయి.
కొండొండోరి సెరువుల కింద (Click to listen)
1. కొండొండోరి సెరువుల కాడా
సే సిరి ముగ్గురు ఎగసాయం యొకడికి
కాడి లేదు రెండు
దూడాలే దు
2. కాడిదూడా లేనెగసాయం
పండెను మూడు పంటాలొకటి
వడ్లు లేవు రెండు
గడ్డీ లేదు
3. వడ్లు గడ్డీ లేని పంటా
ఇశాఖపట్నం సంతలో పెడితే
వట్టి సం తేకానీ సంతలో
జనం లేరు
4. జనంలేని సంతలోకి
వచ్చిరి ముగ్గురు షరాబు లొకరికి
కాళ్ళు లేవు రెండు
సేతుల్లేవూ
5. కాళ్ళు చేతులు లేని షరాబు
తెచ్చిరి మూడు కాసూలొకటి
వొలాల్లొల్లదూ రెండు
సెల్లాసెల్లవు
6. ఒల్లాసెల్లని కాసులు తీసుకు
ఇజయనగరం ఊరికిబోతె
ఒట్టి ఊ రేగాని ఊళ్ళో
జనం లేరు
7. జనం లేని ఊల్లోను
ఉండిరి ముగ్గురు కుమ్మల్లొకడికి
తల లేదు - రెండు కి
మొలాలేదు
8. తల మొల లేని కుమ్మర్లు
చేసి రిమూడు భాండాలొకటికి
అంచులేదూ . రెంటికి
అడుగు లేదు
9. అంచు అడుగు లేని భాండాల్లో
ఉంచిరి మూడు గింజలొకటి
ఉడకా ఉడక దు రెండు
మిడకామిడకావూ
10. ఉడకని మిడకని మెతుకులు తినుటకు
వచ్చిరి ముగ్గురు సుట్టాలొకడికి
అంగు ళ్లేదూ రెండు
మింగు ళ్లేదూ
11. అంగుడుమింగుడు(= లోకుత్తుక) లేని సుట్టాలు
తెచ్చిరి మూడు సెల్లాలొకటి
సుట్టు లేదు , రెండు
మద్దెలేదు.
(త్రి మూర్తులు 1. బ్రహ్మ, 2. విష్ణువు, 3. మహేశ్వరుడు.) అనంతకోటి బ్రహ్మాండాలలో (కొండొండోరి సెరువుల) త్రిమూర్తులు సృష్టి వ్యవసాయం మొదలుపెట్టారు.
వ్యవసాయానికి కాడి, దూడా ఉండాలి కదా ! కాని వీరి వ్యవసాయానికి అవిలేవు. (మిగతా చరణాలన్నింటిలోను ఇదేరీతిగా స మన్వ యించుకోవాలి)
(1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు) పంటలకి వడ్లు , గడ్డీ ఉండాలి కదా ! కాని 1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు అను పంటలకు వడ్లు , గడ్డీ లేవు.
( విశాఖ= ఔన్నత్యపు శాఖలు లేని సంసారం)
( సత్వ రజస్తమోగుణాల పంటను శాఖలు లేని సంసారంలో పెట్టారు. జనం వాటిలో మునిగిపోయారు. ప్రపంచం ఉన్నది కాని ప్రపంచంలో సంసారపు ఊర్ధ్వమూలాన్ని ఆలోచించటానికి ఎవరూ లేరని భావం)
( షరాబులు= కంసాలులు 1. అగ్ని, 2. వాయువు, 3. సూర్యుడు.)
( త్రిదండాలు 1. వాగ్దండము (మౌనము), 2. మనోదండము (ఆశ లేకుండుట), 3. కాయదండము (స్వధర్మాచరణము))
( త్రిదండాలకు ఈలోకంలో చెల్లుబాటు లేదని భావం)
( విజయ అనగా మిక్కిలి గెలుపు. సహస్రార చక్ర భేదనమనే ఊరు. ఈలోకంలో చాలామంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలను ఆచరించి ఉత్తమ యోగాభ్యాసంతో ఆ సహస్రార చక్ర భేదనమనే ఊరుకు వెళదామని చూస్తే ఆ ఊరు చేరిన వారు లేరు. యోగులెవరు లేరని భావం)
(త్రికాలాలు 1. భూతకాలము, 2. భవిష్యత్కాలము, 3. వర్తమానకాలము.)
( ఉత్తమ యోగాభ్యాసము చేసే వారు ఎవరూ లేకపోయినా తలా మొలా లేని- అనగా ఆకారం లేని త్రికాలాల కుమ్మర్లు వస్తూనే ఉంటారని భావం. )
(1. భూలోకము, 2. స్వర్గలోకము, 3. పాతాళ లోకము.)
( కాలం సృష్టించిన లోకాలకు అంచులేదు. అడుగు లేదు.)
( త్రిదోషాలు శ్లేష్మం, పిత్తం, వాతం.)
(ఈలోకాలలో జీవులతో ఆడుకోవటానికి కాలం శ్లేష్మం, పిత్తం, వాతం అను మూడు గింజలను ప్రతి జీవిలోను ప్రవేశపెట్టింది)
(1. మనస్సు, 2. వాక్కు, 3. కర్మ. త్రికరణాలు)
(శ్లేష్మం, పిత్తం, వాతం అను అనువాటిని త్రికరణాలు జీవుల చేత అను భవింపచేస్తున్నాయి)
(1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణము)
(అంచుల్లేని సన్నని బట్టను సెల్లా అంటారు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణములు అటువంటివి సెల్లాలు. వీటిని తెచ్చిన వారు త్రికరణాలు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామములకు చుట్టూలేదు. అనగా ఒక పరిధిలేదు. మధ్య లేదు. ).
https://m.youtube.com/@sobhanaachala/videos
https://m.youtube.com/@sitardush
Literature
Music
తెలుగు జానపదాలు (Telugu Janapadalu)-Telugu folksongs
తెలుగు సాహిత్యము(Telugu Sahityam) -Telugu literature
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment